ఆంధ్రజ్యోతికి, సాక్షికి మధ్య వార్ సహజమైందే. కానీ ఈసారి ఆంధ్రజ్యోతికి, సూర్య దినపత్రికకు మధ్య చోటు చేసుకుంది.
సూర్య దినపత్రిక అధినేత నూకారపు సూర్య ప్రకాశరావును మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసినట్లు ఆంధ్రజ్యోతి ఓ వార్తను ఇచ్చింది. దీనిపై నూకారాపు సూర్యప్రకాశరావు తీవ్రంగా మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను తప్పుపడుతూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గురువారం తాను సూర్య ప్రధాన కార్యాలయంలో ఉండగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన స్క్రోలింగ్, ఆ తర్వాత శుక్రవారం ఆంధ్రజ్యోతిలో 2001 నాటి కేసుకు సంబంధించి ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్‌లో మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి అరెస్టు చేశారని రాసిన వార్త తనను విస్మయానికి గురిచేసిందని సూర్యప్రకాశ రావు అన్నారు.తాను శుక్రవారం వరకూ హైదరాబాద్‌లోనే ఉన్నానని, కనీస వాస్తవాలు, విచారణ చేయకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం నీతిమాలిన జర్నలిజం కాదా? అని ప్రశ్నించారు.ఒక వ్యక్తిని పక్క రాష్ట్రాలకు చెందిన పోలీసులు అరెస్టు చేసినప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్, లేదా కమిషనర్ లేదా ఎస్పీ అనుమతి తీసుకుని వస్తారన్న కనీస స్పృహ, పరిజ్ఞానం లేకుండా వార్తను ప్రచురించడం, పత్రిక నడపటం రాధాకృష్ణకే చెల్లిందని వ్యాఖ్యానించారు.
‘ఇదేనా నీ జర్నలిజం? ఇదేనా నీ సంస్కారం.కుట్ర, కుయుక్తులతో ఎదుటివారిపై బురద చల్లడమేనా నీకు తెలిసిన జర్నలిజం? గతంలో బ్యాంకు కేసులో అరెస్టయినప్పుడు లక్షన్నర రూపాయల కుట్ర కేసులోనూ ఇలాగే వంకర రాతలు, విషపు వార్తలు రాశావు.
రెండుకోట్ల కుంభకోణమని అబద్ధపు ప్రచారం చేశావు. అప్పుడు నేను కూడా కోర్టు తీర్పును గౌరవించి మౌనం వహించా. ఇప్పుడు మళ్లీ నాపై విష ప్రచారానికి ఒడిగడుతున్నావు. నేను ఆఫీసులో, హైదరాబాద్‌లోనే ఉన్నా మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశావని కుట్రపూరిత వార్త రాశావు. ఇకనయినా ఇలాంటి నీతిమాలిన, సిగ్గుమాలిన, అనైతిక వార్తలు మానుకో. వ్యక్తిగా, నైతికంగా, సంస్కారయుతంగా ఎదగడం నేర్చుకో. ఇకపై నీ ఆటలు సాగవు. నీ బ్లాక్‌మెయిల్ జర్నలిజం మానుకుని, ప్రజాస్వామ్య, పత్రికాస్వామ్య పద్ధతులు పాటించు’ అని నూకారపు విరుచుకుపడ్డారు.
తప్పుడు రాతలు, నీతిబాహ్యమైన వార్తలతో బడుగువర్గాల శత్రువుగా మిగిలిపోయిన నీకు బడుగులు బుద్ధిచెప్పే రోజు ఇంకెంతో దూరంలో లేదన్నారు. ఇకనయినా రాధాకృష్ణ బుద్ధిగా మసలుకోవాలని, ఎదుటివారి తప్పులు ఎంచే సమయంలో తన తప్పులూ ఎంచుకోవాలని సూచించారు.ఆంధ్రజ్యోతి వార్త తనను తీవ్రంగా కలచివేసిందని, ఇంత అమానుషంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అనాగరికమని, ఇది మనుషులు చేసే పనికాదని నూకారపు అన్నారు.